కర్ణాటకలోని పావగడ సోలార్ పార్క్ స్థానికులను, భారతదేశపు పునరుత్పాదక లక్ష్యాలను విఫలం చేసింది

0
ప్రతీకాత్మక చిత్రం- శీర్షిక: సోలార్ పార్క్ వెంట నడుస్తున్న పశువుల కాపరి. చిత్రం క్రెడిట్స్: వైష్ణవి సురేష్

2015 వ సంవత్సరంలో కర్ణాటకలోని వొల్లూరు గ్రామానికి చెందిన ముత్యాలప్ప వెంకటేష్, అతని తోటి గ్రామస్తులు లాభదాయకమైన ఆఫర్ను అందుకున్నారు. తమ భూమిలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయటం వల్ల ప్రతి సంవత్సరానికి ఒక ఎకరానికి 21,000 రూపాయలు చొప్పున సంపాదించవచ్చును.

చాలా కాలంగా వెంకటేష్ తన జీవితంలో ధనిక రైతుల వద్ద వ్యవసాయ కూలీగా పని చేస్తూ  ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూశాడు. సుదీర్ఘమైన  కరువు కాలంలో 17 మంది సభ్యులు ఉన్న తన ఉమ్మడి కుటుంబాన్ని పోషించడానికి తన వద్ద ఉన్న మూడు ఎకరాలలో వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. గ్రామంలో సోలార్ పార్క్ అంటే అతనికి స్ఫురించిన రెండు విషయాలు: ఉద్యోగాలు మరియు న్యాయం.

ఆది కర్ణాటక షెడ్యూల్డ్ కులాల తెగకి చెందిన 49 ఏళ్ళ వెంకటేష్ “మా పొరుగువారైన అగ్ర గౌడ కులానికి చెందిన వారికి స్థిరాదాయం వల్ల కలిగిన లాభం చూశాము, పేదరికం నుండి బయట పడటానికి స్థిరాదాయం కలిగిన స్థిరమైన ఉద్యోగాలు ముఖ్యమని తెలుసుకున్నాము” అన్నారు

ఏడేళ్లుగా సోలార్ పార్క్ తక్కువగా పంపిణీ చేసింది.

2000 మెగావాట్స్ సోలార్ పార్క్ ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వానికి భూమినిచ్చిన పావగడ 5 రెవెన్యూ గ్రామాలకి చెందిన సుమారు 2000 కుటుంబాలలో వెంకటేష్ ఒకరు. ప్రపంచంలోనే విశాలమైన, భారతదేశంలో అతిపెద్దదిగా భావించబడిన ఈ సోలార్ పార్క్ 13,000 ఎకరాల వ్యవసాయ భూమిలో విస్తరించి ఉంది. భూమికి బదులుగా గ్రామస్తులు అద్దెలు, ఉద్యోగాలు మరియు స్థానిక మౌలిక సదుపాయాలు వంటి అవకాశాలు పొందారు. క్రమం తప్పకుండా అద్దె వస్తున్నప్పటికీ కూడా, ఒకప్పుడు వ్యవసాయంపై ఆధారపడిన చాలా మంది సౌర ఫలకాల (సోలార్ ప్యానెల్లు)  వలన జీవనాధారమైన వ్యవసాయ మూలాన్ని కోల్పోయారు. మేము మాట్లాడిన గ్రామస్తులు దాదాపు 12,000 మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారని, కేవలం 2,000 మంది మాత్రమే సోలార్ పార్కులో ఉద్యోగాలు పొందగలిగారు, అది కూడా కులము మరియు లింగ ప్రాతిపదికన సక్రమంగా జరగలేదని అన్నారు.

లెక్క ప్రకారం భారతదేశం ప్రస్తుతం 64.38 గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని కలిగి ఉంది. లార్జ్ స్కేల్ సోలార్ పార్కులను ఏర్పాటు చేయడం భారత ప్రభుత్వానికి కీలకమైన సాధనగా ఆవిర్భవించింది. అయితే ఈ పరిశ్రమ ఆర్థిక సామర్థ్యం మరియు ఉద్యోగ కల్పనకి ముఖ్యమైన మూలంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది.

ఏదేమైనప్పటికీ పావగడ సోలార్ పార్క్, భారతదేశ సౌర శక్తి రంగంలో ఒక కీలక వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది అనే దానికి ఒక ఉదాహరణ. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సౌర రంగంలో 85,900 కార్మికులు ఉపాధిని పొందారు అయితే నిశితంగా పరిశీలిస్తే కనిపించే చిత్రం వేరు. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలోని రాజకీయ ఆర్థిక పరిశోధనా సంస్థ, సహాయ రీసర్చ్ ప్రొఫెసర్ శౌవిక్ చక్రబర్తి గారి మాటల్లో “ఉద్యోగాలు ఎక్కువగా కల్పించగలిగే అవకాశం ఉన్న రంగమే కానీ, ఇక్కడ ఉద్యోగాల నాణ్యత అధ్వాన్నంగా ఉండవచ్చు ముఖ్యంగా నిర్మాణం లేదా అనధికారిక ఉద్యోగాల నాణ్యత.”

మరి ఉద్యోగాలేవి?

2016 మరియు 2019 మధ్య కేఎస్పీడీసీఎల్ వ్యవసాయ భూములను కాంక్రీట్ స్థలాలుగా మార్చడంతో పావగడ గ్రామాల నుండి వలస వెళ్లిన స్థానికులు ఇప్పుడు ఇంటికి దగ్గరగా సౌర ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలు పొందవచ్చని ఆశతో తిరిగి రావడం జరిగింది.

తిరుమణి గ్రామస్తుడైన 30 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ కోనప్ప సోలార్ పార్క్ ప్రాజెక్టు ప్రకటించినప్పుడు బెంగళూరులో తన బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలి తిరిగి వచ్చారు. కోనప్ప “పార్కులో మాకు 8000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు, ఇది ఎకరానికి ఒక ఉద్యోగం కంటే తక్కువ” అన్నారు.

ప్రారంభంలో స్థానికులు తమ భూమిని ఇవ్వటానికి మరియు పార్కులో పని దొరుకుతుందని ఇతరులను ఆకర్షించడానికి నిర్మాణ స్థలాలలో ప్రాథమిక ఉద్యోగాలు ఇచ్చారు. పావగడలోని యువ పట్టభద్రులు ఇప్పటికీ పార్కులో ఉద్యోగాల కొరకు ఆసక్తి చూపుతున్నారు. 32 ఏళ్ళ ఎంబీఏ గ్రాడ్యుయేట్ చంద్రబాబు నాయుడు “స్థానిక ఉద్యోగాల మార్కెట్ లో విలువ ఉంటుందని ఎక్కువమంది పారిశ్రామిక శిక్షణ డిప్లమోలను ఎంచుకుంటున్నారు, అయితే కేఎస్పీడీసీఎల్ నియామకంలో ఉన్న పోటీ వల్ల పారిశ్రామిక శిక్షణ పొందిన వారు సాంకేతిక ఉద్యోగాలకు అర్హత పొందలేకపోతున్నారు” అన్నారు. “ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్న అభ్యర్థులను వారు ఇష్టపడతారు” తన వివరాలు చెప్పవద్దన్న ఒక ఉద్యోగి అన్నారు.

కేఎస్పీడీసీఎల్ జీఎం ఎన్.అమర్నాథ్ మాట్లాడుతూ మేము ప్రైవేటు వ్యాపారవేత్తల నుండి లీజు డబ్బు వసూలు చేసి భూ యజమానులకు పంపిణీ చేయడంలో సహాయపడతాము అన్నారు.

కేఎస్పీడీసీఎల్, ఏఈఈ, ఆర్. మహేష్ మాట్లాడుతూ చాలావరకు పార్క్ పనులు, సబ్స్టేషన్ పనులు మానవ రహితంగా అవుతాయని మాకు తెలుసు కానీ మేము ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వ్యక్తులను నియమిస్తున్నాము అన్నారు. తన వివరాలు చెప్పవద్దన్న మరొక అసిస్టెంట్ ఇంజనీర్ సోలార్ పార్క్ బ్లాకులకి కనీస మానవ పరస్పర చర్య మాత్రమే అవసరమని నిర్ధారించే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

అయితే ఉద్యోగాల గురించి అందరూ ఫిర్యాదు చేయడం లేదు. 29 ఏళ్ల అశోక్ నాయుడు హై స్కూల్ వరకే చదువుకున్నారు. అతని పరిమిత విద్య ధన సంపాదనకి ఆటంకం కాలేదు. పార్క్ నిర్మాణం ప్రకటించిన వెంటనే లారీలు, ఎక్స్ కవేటర్లు కొన్నాడు. సంపన్న నాయుడు వర్గానికి చెందిన ఇతను ప్రస్తుతం కాంట్రాక్టర్ గా పనిచేస్తూ ‘హరిత’ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు.

భారతదేశ కార్మిక మార్కెట్లో అభివృద్ధి చెందుతున్న కొత్త హరిత ఆర్థిక వ్యవస్థలో వ్యవస్థాగత అసమానతలు ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని పరిష్కరించే ప్రయత్నం జరగడం లేదని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన చక్రబర్తి అన్నారు.

అసమానతల నిర్మూలన

వెంకటేష్ “సోలార్ ఆర్థిక వ్యవస్థలో ఎలా ఒక వ్యక్తి జీవనోపాధిని పొందాలో ఎలాంటి ఒప్పందాలకు సమ్మతించాలో మాకు తెలియదు” అన్నారు. అతనితోపాటు ఇంకొందరు కూడా తమ భూములను తక్కువ విలువకి బేరం చేశారని, అది గ్రహించే లోపే కేఎస్పీడీసీఎల్ మా భూములను ఆధీనం చేసుకుంది అని చెప్పారు. 2017 లో సోలార్ డెవలపర్ల కొరకు టెండర్లు వేశారు. అదానీ గ్రూపు, టాటా గ్రూపు మరియు ఫిన్నిష్ పవర్ కంపెనీ ఫోర్టం కాంట్రాక్టులు చేజిక్కించుకున్న డెవలపర్లలో ఉన్నారు.

2016 లో కేఎస్పీడీసీఎల్ అధికారులు మరియు రైతులకు జరిగిన కొన్ని సమావేశాలు జరిగాయి. వాటికి హాజరైన తిరుమణి కి చెందిన 50 ఏళ్ల రైతు ఆకలప్ప “మొదటి సమావేశంలో, డి. కే. శివకుమార్ సమక్షంలో రైతులకి ఇస్తున్న వార్షిక కౌలు అద్దె సరిపోదని అన్నాను” అని గుర్తుచేసుకున్నారు. కానీ కేఎస్పీడీసీఎల్ అధికారులు ఆయన వాదనను ఖండించారని మరియు కౌలు అద్దె కన్నా వ్యవసాయ భూమి నుండి వచ్చే లాభాలు అధికమని నిరూపించమన్నారు. అతను “మా వద్ద ఎటువంటి రుజువు లేదు” అన్నారు.

వెంకటేష్ వంటి అణగారిన కులాల వారికి ఫలితాలు దారుణంగా ఉన్నాయి.

“ఒక సంపన్న భూ యజమాని భూమిని పార్కు కోసము లీజుకు ఇచ్చినప్పుడు తమకే మొదట ఉపాధి కల్పించాలని అడుగుతారు,” అన్నారు . అతని పొరుగున నివసిస్తున్న సుమారు 150 కుటుంబాలు —ఎక్కువగా ఎస్సీ కమ్యూనిటీ— పార్కుకు మొత్తం 30 ఎకరాలు భూమిని ఇచ్చారని, అగ్రకులానికి చెందిన ఒక్క కుటుంబమే ఇంత పరిమాణంలో భూమిని లీజుకు ఇవ్వగలదని చెప్పారు.

నైపుణ్యం మరియు అధిక ఆదాయం కలిగిన ఉద్యోగాలపై ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతుందని చక్రవర్తి అన్నారు.

కాంట్రాక్టర్ల పని కూడా అటువంటిదే. ఇది అసాధారణమైన విషయమేమీ కాదని, కేఎస్పీడీసీఎల్ వారి భూభాగంపై గడ్డి కోయడానికి ప్యానెల్స్ శుభ్రం చేయడానికి కావలసిన కూలీలను ఏర్పాటు చేసే కాంట్రాక్టులు పెద్ద భూస్వాములకే ఇస్తుందని వెంకటేష్ అన్నారు.

సక్రమంగా జీతాలు లేకపోవడం వలన అట్టడుగు వర్గానికి చెందిన గ్రామస్తులకు అప్పు చేయాల్సిన దుర్గతి పట్టింది. వారు ఏటా లీజు జమ కోసం వేచి ఉండవలసి ఉంటుంది కాబట్టి స్థానిక భూస్వాముల నుండి స్వల్పకాలిక రుణాలు తీసుకుంటారు.

అంధకార భవిష్యత్తు

అగ్రకులమైన వొక్కలిగ వర్గానికి చెందిన కోనప్ప వంటి వారు తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు నిరాకరించారు కానీ అణగారిన వర్గాల వారికి అలా చేయగలిగే స్తోమత లేదు. ఆధిపత్య కులాల సభ్యులు తమ సొంత వృత్తులలో కాకుండా ఇతర వృత్తులలో పనిచేయకపోవడం వలన నిరుద్యోగ సమస్యను స్వచ్ఛందంగా ఎదుర్కొంటారని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

వెంకటేష్ “మేము మా పొలాల్లో ఎలాంటి అల్పమైన పనులైతే చేశామో అలాంటివే ఇప్పుడు మా ప్రజలు పార్కులో గడ్డి కోయడం, పానెల్స్ శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తున్నారు” అన్నారు.

“మా పిల్లలు మా అడుగుజాడల్లో నడవడం మాకిష్టం లేదు కానీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వారికి వేరే మార్గం ఉండదు.” సోలార్ ప్యానల్స్ కి వ్యతిరేక దిశలో అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ “పేదరికంలో పుట్టాము అదే పేదరికంలోనే చనిపోతాము.” వెంకటేష్ అన్నారు.

పులిట్జర్ కేంద్రం ఈ కథనానికి మద్దతు ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here